యుద్ధానికి రిలయన్స్‌ సిద్ధం!

  • In Money
  • January 24, 2019
  • 986 Views
యుద్ధానికి రిలయన్స్‌ సిద్ధం!

అమెరికా కార్పొరేట్‌ దిగ్గజాలైన వాల్‌మార్ట్‌, అమెజాన్‌ల యుద్ధానికే పరిమితమైన భారతీయ ఈ కామర్స్‌ మార్కెట్లలో త్రిముఖ పోటీకి తెరలేవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లోనే అతి పెద్ద కార్పొరేట్‌ సామ్రాజ్యమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేష్‌ అంబానీ రాకతో ఈ కామర్స్‌ మార్కెట్‌లో పోటీ మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే ఈ పోరుకు సిద్ధమయ్యేలా దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది చిరు వ్యాపారులను వినియోగదారులకు అనుసంధానించేలా ముఖేష్‌ బృందం ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా తొలుత గుజరాత్‌లో 12లక్షల మంది చిరువ్యాపారులను అనుసంధానిస్తారు.

* మొదటి దశలో దేశంలోని దాదాపు 10వేల రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లతో వ్యాపారులను అనుసంధానిస్తారు. వీరికి కామన్‌ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను సమకూర్చనున్నారు. దీంతోపాటు సరళంగా ఉండేలా చెల్లింపు టెర్మినల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది ఈ కామర్స్‌ దిగ్గజాలకు నేరుగా పోటీ ఇస్తుంది. ఇప్పటికే రిలయన్స్‌ రిటైల్‌ నెట్‌వర్క్‌ మొత్తం 6,500 ఊళ్లకు విస్తరించింది. దీనికి 50 గోదాములు కూడా ఉన్నాయి. దీంతో పంపిణీ వ్యవస్థను మెరుగ్గా నిర్వహించే అవకాశం ఉంది.

* భారత్‌లోని మొత్తం 500 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 200 మిలియన్లు గ్రామీణ ప్రాంతాల వారు. వీరిలో చాలా మంది నెలకు ఒకసారి మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చౌకైన 4జీ సేవలతో జియో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. ఈ నేపథ్యంలో పల్లెలు, చిన్న పట్టణాల్లోని దుకాణాలు కూడా హైబ్రీడ్‌ ఆఫ్‌ లైన్‌ ఆన్‌లైన్‌ మోడల్స్‌లో వినియోగదారులతో లావాదేవీలు జరిపే అవకాశం ఏర్పడింది. ఆన్‌లైన్‌ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాదిలోనే 120 మిలియన్లను దాటవచ్చని అంచనా.

* ఇప్పటికే భారత్‌లో జియో వినియోగదారులు దాదాపు నెలకు 500 కోట్ల గంటల వీడియోలను వీక్షిస్తున్నారు. దీంతో రిలయన్స్‌కు ఏజియో పేరిట ఉన్న ఫ్యాషన్‌‌ ఉత్పత్తుల ప్రచారానికి ఇది అద్భుతమైన వేదికగా ఉపయోగపడనుంది.

* రిలయన్స్‌ ఈ మార్కెట్‌లో అడుగుపెట్టడానికి గుజరాత్‌ను వేదిక ఎంచుకోవడానికి కారణం ఉంది. ఇక్కడ భారీ సంఖ్యలో వ్యాపారులు ఉన్నారు. దీంతో రిలయన్స్‌ కొత్త వేదికపైకి తగినంత మంది చిరు వ్యాపారులు రావడానికి అవకాశం లభిస్తుంది.

* రిలయన్స్‌ జియోకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 4,000 శాఖలు ఉన్నాయి. వీటి సంఖ్యను 10,000కు పెంచనుంది. జియోకు 280 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. వీరిలో సింహభాగాన్ని ఈకామర్స్‌ వినియోగదారులుగా మార్చుకున్నా, కొత్త వ్యాపారానికి తిరుగుండదు. ‘‘ కొత్త తరంలో సమాచారమే ఇంధనం’’ అని అంబానీ వ్యాఖ్యానించడం వెనుక అసలు రహస్యం ఇదే. ఈ కామర్స్‌ వ్యాపారంలో డేటా ఆధారంగానే లక్షిత వినియోగదారులను గుర్తించి అమ్మకాలు జరుపుతారు.

* అత్యాధునిక సాంకేతికతను రిలయన్స్‌ ఈకామర్స్‌ వ్యాపారంలో ఉపయోగించుకొంటుందని గత మార్చిలో ముఖేష్‌ అంబానీ వెల్లడించారు. దీనిలో భాగంగా అగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, హోలోగ్రాఫ్స్‌ను ఉపయోగించుకొని అద్భుతమైన షాపింగ్‌ అనుభవాన్ని వినియోగదారులకు ఇస్తామన్నారు.

* కొత్త ఈకామర్స్‌ పాలసీ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలు తమకు వాటాలు ఉన్న కంపెనీల్లో వస్తువులను ఎక్స్‌క్లూజీవ్‌ పేరుతో విక్రయించడానికి వీల్లేదు. ఈ నిబంధనలు అమెజాన్‌కు, వాల్‌మార్ట్‌కు ఇబ్బందులను సృష్టించవచ్చు. రిలయన్స్‌కు ఈ నిబంధనలు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

* కేంద్ర ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్‌ చేయడంపై పట్టుదలతో ఉంది. నగదు రహిత భారత దేశాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోంది. ఇదే సమయంలో ఈ కామర్స్‌ రంగంలోకి అడుపెట్టడం రిలయన్స్‌కు కలిసి రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos