విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజాందోళనకు పిలుపు

విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజాందోళనకు పిలుపు

న్యూ ఢిల్లీ : పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2020 ముసాయిదా పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. దేశాన్ని దోచుకోవడమే దాని లక్ష్యమని దుయ్యబట్టారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఈఐఏ-2020 లక్ష్యం స్పష్టంగా ఉంది. అదే దేశాన్ని దోచుకోవడం. దేశ వనరులను కాజేసిన సూటు-బూటు స్నేహితుల కోసమే భాజపా ప్రభుత్వం ఈ ముసాయిదా తీసుకొచ్చింది. దేశ దోపిడీని, పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవాలంటే ఈఐఏ-2020 ముసాయిదాను ఉపసంహరించాల్సిందేన’ని తేల్చి చెప్పారు. నూతన ముసాయిదాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ముసాయిదాను ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. దీని వల్ల భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయ’ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.‘పర్యావరణ పరిరక్షణ పోరులో సంవత్సరాలుగా సాధించిన విజయాలను ముసాయిదా తలకిందులు చేస్తుంది. అంతే కాకుండా.. దేశవ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం, అల్లకల్లోలం సృష్టిస్తుందన్నా’రు. అభివృద్ధి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల ప్రక్రియలో మార్పు చేయడంలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావ మదింపు ముసాయిదాను రూపొందించింది. ప్రాజెక్టు, పరిశ్రమలకు భూసేకరణ పూర్తి చేయకుండానే పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విధంగా కొత్త ముసాయిదాలో వీలు కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల నుంచి సూచనలను, వినతులను తీసుకునే ప్రక్రియకు కేవలం 20 రోజులే గడువిచ్చారు. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos