న్యూ ఢిల్లీ: ఒక ఫోన్ కాల్ ముంబైలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న యువకుడి ప్రాణాల్ని కాపాడింది. ముంబైలో వంట పని చేస్తున్న ఢిల్లీకి చెందినన యువకుడు జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోనున్నానని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. దీన్ని ఐర్లాండ్ లోని ఫేస్ బుక్ అధికారి కంట కనపడింది. వెంటనే ఆయన ఢిల్లీ పోలీసులకు విషయాన్ని చరవాణి , మెయిల్ ద్వారా తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ సెల్ అధికారులు ఆ యువకుడి ఫేస్ బుక్ ఖాతా ఆధారంగా ఫోన్ నంబర్ ను కనిపెట్టారు. తను ముంబైలో ఉన్నాడని పసిగట్టి, అక్కడి పోలీసులకు విషయాన్ని చేరవేశారు. ఆ వెంటనే అతనున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సైబర్ విభాగం డీసీపీ అనేశ్ రాయ్ తెలిపారు.