హోసూరు : ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలి తప్ప సమావేశాల నుండి వాకౌట్ చేయడం భావ్యం కాదని డీఎంకే పార్టీ కౌన్సిలర్ లకు మాజీమంత్రి బాలకృష్ణారెడ్డి హితవు పలికారు. శుక్రవారం హోసూరు యూనియన్ కార్యాలయంలో యూనియన్ చైర్ పర్సన్ శశి వెంకటస్వామి నేతృత్వంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఏడిఎంకె పార్టీ కౌన్సిలర్ల తో పాటు ఏడు మంది డీఎంకే పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. హోసూర్ యూనియన్ లోని 26 పంచాయతీలలో కార్యదర్శుల దే పెత్తనమని డీఎంకే పార్టీ కౌన్సిలర్లు ధ్వజ మెత్తారు. పంచాయతీ కార్యదర్శుల వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని, దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని డీఎంకే కౌన్సిలర్లు సమావేశంలో డిమాండ్ చేశారు. కార్యదర్శులను పంచాయితీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పై అడిగితే డీఎంకే పార్టీ కౌన్సిలర్ లకు సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శులపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏడు మంది కౌన్సిలర్లు సమావేశం నుండి వాకౌట్ చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి బాలకృష్ణ రెడ్డి, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో చర్చించి పరిష్కరించుకోకుండా డీఎంకే పార్టీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు డీఎంకే పార్టీ కౌన్సిలర్లు పంచాయతీ కార్యదర్శులపై అలిగి సమావేశం నుంచి వాకౌట్ చేయడం బాధాకరమని బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. డిఎంకె పార్టీ కౌన్సిలర్లు ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరించేందుకు చర్యలు చేపడతారని అన్నారు. రాబోయే రోజుల్లో జరిగే కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై డీఎంకే పార్టీ కౌన్సిలర్లు చర్చించి, పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే మంచిదని ఆయన హితవు పలికారు.