తిరువనంత పురం : విపక్ష నేత రమేశ్ చెన్నితల సంఘపరివార్ చేతి కీలు బొమ్మగా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడిరేయ్ బాలకృష్ణణ్ ఆరోపించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్, భాజపాలు ఏకమయ్యాయని దుయ్యబట్టారు. ‘రమేశ్ చెన్నితల ఆరెస్సెస్ డార్లింగ్. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని గానీ, కున్హలీ కుట్టిని గానీ నియంత్రించాలని సంఘ్ అనుకోలేదు. విపక్ష నేత రమేశ్ చెన్నితలకు మద్దతిస్తోంది. ఆరెస్సెస్ ఏది కోరుకుంటుందో చెన్నితల అదే చేస్తున్నారు. . పినరయ్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ను కూలదోయడానికి కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోయాయి. కేరళలో బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలపడం చూసి ఆశ్చర్యపోయా. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.’’ అని మండి పడ్డారు. గోల్డ్ స్కామ్ గురించి ఎక్కడైనా విచారణ చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థకు పూర్తి అధికారాలున్నాయి. ఎక్కడ, ఎవర్ని దర్యాప్తు చేయాలన్నా ఆ సంస్థకు ప్రభుత్వం పక్షాన పూర్తి మద్దతిస్తామ’ని స్పష్టం చేశారు.