టీడీపీలో ఎమ్మెల్సీ పదవులు వీళ్లకేనా!

ఏపీ అసెంబ్లీ కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరనే అంశం ఆసక్తిదాయకంగా మారనుంది. మొత్తం ఐదు సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిల్లో నాలుగు సీట్లు టీడీపీకి దక్కుతాయట. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత కూడా ఈసారి టీడీపీ ఓట్లు వేయించుకునే అవకాశం ఉంది.ఎన్నికలకు ఇక ఎలాగూ పెద్దగా సమయం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత టీడీపీ తను నిలబెట్టే ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓట్లు వేయించుకోవచ్చు. ఏ కోర్టో అనర్హత వేటు వేసేలోపు ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి.. ఫిరాయింపుదారులు తెలుగుదేశం వైపు ఓటు వేసే అవకాశాలున్నాయి.ఈ నేపథ్యంలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ తన వాళ్లను గెలిపించుకునే అవకాశం ఉంది. నాలుగు సీట్లలో ఒకటి యనమలకు రిజర్వ్డ్ అని సమాచారం. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం మానేసిన యనమలకు మరో టర్మ్ అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇక మిగిలిన సీట్లలో పార్టీలోకి కొత్తగా చేరి వస్తున్న వాళ్లకు అవకాశం ఇస్తారట. పాత వాళ్లకు సున్నా చుడుతున్నారని టాక్.పార్టీలోకి చేరబోతున్న వంగవీటి రాధా, ఘట్టమనేని ఆదిశేషగిరి రావులకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవులను ఇవ్వనుందని తెలుస్తోంది. విశేషం ఏమిటంటే.. రాధా, ఘట్టమనేనిలు వైసీపీలో తాము కోరుకున్న సీట్లలో పోటీకి అవకాశం దక్కలేదనే అసంతృప్తితో టీడీపీలోకి చేరుతున్నారు. అయితే టీడీపీలో మాత్రం నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులతో వీళ్లు సంతృప్తి పడుతున్నారట.ఇక వీళ్లు ప్రత్యక్షపోటీ వైపు వెళ్లకుండా.. నామినేటెడ్ పదవులవైపు వెళ్తుంటే, నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి నారాయణ మాత్రం  ప్రత్యక్ష పోటీకి సై అంటున్నాడు. నెల్లూరు నుంచి పోటీచేయడానికి ఆయన ఎమ్మెల్సీ నామినేషన్ ను సైతం వదిలేస్తున్నాడని సమాచారం. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణికి బాబు మరోసారి అవకాశం ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos