న్యూ ఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఒక వైపు సంక్షోభం నెలకొనగా.. మరో వైపు దాయపు పన్ను దాడులు జరగడం కలకలాన్ని రేపింది. దాదాపు 200 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు సోమవారం రంగంలోకి దిగి ముఖ్యమంత్రి గహ్లోత్కు సన్నిహితులైన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన నివాసాలు, కచ్చేరీల్లో సోదాలు చేసారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మేందర్ రాఠోడ్కు చెందిన దాదాపు 12 ఆస్తుల్ని సోదా జరిపినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నగల వ్యాపారి రాజీవ్ అరోరా ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై రాజస్థాన్, దిల్లీ, మహారాష్ట్రలలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. జైపుర్, కోటా, దిల్లీ, ముంబయి నగరాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశం వెలుపల చేసిన లావాదేవీలపై దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.