ఒక హత్యను దాచాలని….

ఒక హత్యను దాచాలని….

వరంగల్ : సంచలనం సృష్టించిన వరంగల్ గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటనను వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. బిహార్కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ (24) ఈ దారుణానికి పాల్పడ్డాడని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టి.. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడించారు.
‘గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్, అతడి భార్య పనిచేసేవారు. బిహార్కు చెందిన సంజీవ్ కుమార్ యాదవ్కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు దగ్గరయ్యాడు. అనంతరం గీసుకొండ మండలం జాన్పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. అయితే తన కుమార్తెతో కూడా నిందితుడు చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్ను నిలదీసింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజీవ్ యాదవ్ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్ రథ్ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్ర మాత్రలు కలిపి అమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆమెను రైల్లోంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. అయితే, అక్క కూతురు గురించి మక్సూద్ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్ కుటుంబాన్ని కూడా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారు పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించాడు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించాడు. ఈ నెల 20వ తేదీన మక్సూద్ మొదటి కుమారుడైన షాబాజ్ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18వ తేదీన వరంగల్ చౌరస్తాలో ఓ మెడికల్ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20వ తేదీ రాత్రి వారితో ముచ్చటించాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న వారందరినీ గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.
మొత్తం ఈ కేసు ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశాం. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. వాటిని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేశాం. ఇంట్లోంచి వెళ్లడం దగ్గర నుంచి మళ్లీ చేరుకునే వరకు అందులో నమోదయ్యాయి. దీంతో ఈ రోజు మధ్యాహ్నం నిందితుడిని జాన్పాక్లోని తన ఇంటిలో అదుపులోకి తీసుకున్నాం. కస్టడీకి తీసుకుని వివరాలు రాబడతాం’ అని రవీందర్ వెల్లడించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos