ఆదాయం ఉన్నా…వసతులు శూన్యం : హొసూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దుస్థితి

ఆదాయం ఉన్నా…వసతులు శూన్యం : హొసూరు  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దుస్థితి

హోసూరు : ఇక్కడి సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయాల ఆదాయం వస్తున్నా వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకొంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామికంగా హోసూరు పట్టణం అభివృద్ధి చెందడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగానే సాగుతున్నది. హోసూరు పట్టణం కర్ణాటక సరిహద్దుకు కేవలం 10 కి.మీ. దూరంలో ఉండడం,బెంగళూరుకు 45 కిమి దూరంలో హోసూరు పట్టణం ఉండడం వల్ల ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా సాగుతున్నందున హోసూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఆదాయం బాగా ఉంది.
ఎంత ఆదాయం వచ్చినా సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం నేటికీ పాత భవనంలోనే కొనసాగుతున్నది. నెలకు కోట్ల రూపాయల్లో  ప్రభుత్వానికి ఆదాయం  సమకూరినా, కొత్త భవన నిర్మాణం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం హోసూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వరండాలో పైకప్పు పెంకులు పగిలిపోతున్నా, కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు దుయ్యబడుతున్నారు.  సంబంధిత అధికారులు వెంటనే కొత్త భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో పాటు ఇప్పుడున్న భవనానికి సత్వరమే మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos