రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మంగా పావులు కదుపుతోంది. ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ ఆ విజయం ఇచ్చిన ఊపులో కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్రాల పీసీసీల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.దీనిలో భాగంగా సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. ఆమెను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌పై గురిపెట్టిన హస్తం..ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ను నడిపించే అధికారాలను ప్రియాంకకు కట్టబెట్టింది. అలాగే మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన యువనేత జ్యోతిరాథిత్య సింధియాను పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
ప్రియాంక చాలా సమర్థురాలు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రియాంక, జ్యోతిరాదిత్య సింథియా వంటి యువ నేతలతో తాము ఈ పోరాటంలో ముందడుగు వేస్తామన్నారు. పేదలు, బలహీన వర్గాల కోసం తాము పోరాడుతామన్నారు. తాము ఫ్రంట్ ఫుట్‌పై పోరాడతామన్నారు. తాము ఉత్తర ప్రదేశ్‌కు, ఉత్తర ప్రదేశ్ యువతకు అవసరమైనవాటి కోసం పోరాడుతామన్నారు. బ్యాక్‌ఫుట్ మీద ఆడే పార్టీ తమది కాదన్నారు. ఎక్కడైనాసరే ఫ్రంట్ ఫుట్పైనే ఆడతామన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఓ కొత్త, సానుకూల మార్పు వస్తుందన్నారు. ప్రియాంక గాంధీని తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన నేపథ్యంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తన సోదరి ప్రియాంక చాలా సమర్థురాలని, తనతో కలిసి పని చేస్తారని చెప్పారు. ఆమె తనతో కలిసి పని చేస్తారన్నారు. ఇది తనకు చాలా సంతోషకరమని చెప్పారు. జ్యోతిరాదిత్య సింథియా కూడా చాలా సమర్థుడని చెప్పారు. ప్రియాంక, జ్యోతిరాదిత్యలకు తాను ఓ కార్యక్రమాన్ని అప్పగించానన్నారు. మాయావతి, అఖిలేశ్‌లను తాను గౌరవిస్తానన్నారు. తమ ముగ్గురి లక్ష్యం ఒకటేనని, అది బీజేపీని ఓడించడమేనని చెప్పారు. మాయావతి, అఖిలేశ్‌లతో తమకు వైరం ఏదీ లేదన్నారు. తమ మధ్య భావసారూప్యత ఉందన్నారు. వారికి సహకరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను సర్వనాశనం చేసిందన్నారు. తాము రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నారు. యువత కంటున్న కలలను సాకారం చేస్తామన్నారు.