రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతోంది. గత ఏడాది మే 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 30వ తేదీన వైఎస్ జగన్ విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ప్రమణ స్వీకారం చేసిన తేదీని ప్రాతిపదికగా తీసుకున్నారాయన. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.జాతీయ స్థాయి మీడియా ఎన్డీటీవీకి దీనికి సంబంధించిన కాంట్రాక్టును అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించినట్లు చెబుతున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సందర్బంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రజాభిప్రాయానికి పూనుకోవడం వల్ల చివరి నాలుగేళ్లలో ప్రజల అభీష్టానికి అనుగుణంగా పరిపాలను సాగించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం పెద్దలు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేర్చామని కూడా అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మూడు రాజధానుల ఏర్పాటు వంటి అంశాలపైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించబోతోంది.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనపై చేపట్టిన అభిప్రాయ సేకరణ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడంతో.. ఈ సారి ఏకంగా ప్రభుత్వం పైనే ప్రజాభిప్రాయ సేకరణకు దిగబోతున్నట్లు చెబుతున్నారు. అమ్మఒడి, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, ఉద్యోగాల కల్పన సహా ఈ ఏడాది కాలంలో చేపట్టిన అన్ని పథకాలు, నిర్ణయాలపైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి సిద్ధమవుతోంది. అన్నింటి కంటే మూడు రాజధానుల ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, దీనిపై మెజారిటీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది.