కుంభకోణాలే వైకాపా అధ్యక్షుడు జగన్కు నవరత్నాలని ఏపీ ఆర్థిక మంత్రి మండిపడ్డారు. జగన్ నేరాలను కాపీకొట్టడం ఎవరి తరమూ కాదని ఆయన ఎద్దేవా చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జగన్ అవినీతి ఒక సబ్జెక్టు అని యనమల వ్యాఖ్యానించారు. ఎమ్మార్, టైటానియం, వోక్స్ వ్యాగన్, మద్యం, ముగ్గురాయి, బాక్సైట్, ఇనుప ఖనిజం, వాన్పిక్, లేపాక్షి, జలయజ్ఞం.. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్ కుంభకోణాలకు అంతేలేదని యనమల ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్లు, 13 ఛార్జి షీట్లు, 16 నెలల జైలు.. ఇవి తప్ప జగన్ సాధించింది ఏముందని నిలదీశారు.పేదలకు పింఛన్ల పెంపు, కాపులకు 5శాతం రిజర్వేషన్లు, ఆటో డ్రైవర్లకు పన్ను తొలగించడం లాంటివి చేస్తే వైకాపా తమను నిందిస్తోందని మండిపడ్డారు. ట్రాక్టర్లపై పన్ను తొలగిస్తే విమర్శిస్తున్నారన్నారని దుయ్యబట్టారు. మంచి చేయడాన్ని వ్యతిరేకించే ఏకైక పార్టీ వైకాపా అని, సమాజానికి చెడు జరగాలని కోరే పార్టీ వైకాపా అన్నారు. పేదల సంక్షేమం పార్టీ తెలుగుదేశమని, ప్రజాధనం దోపిడి పార్టీ వైకాపా అన్నారు. నిర్మాణానికి తెదేపా నిదర్శనమైతే…, విధ్వంసానికి వైకాపా చిహ్నమని, అందుకే అన్నివర్గాల ప్రజలు తెదేపా వెన్నంటే ఉన్నాయంటూ యనమల వ్యాఖ్యానించారు.