ప్రేయసిని చూడడానికి వచ్చి ఓ యువకుడు కరోనా బారినపడ్డాడు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన ఓ యువకుడు చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. చిత్తూరు పట్టణంలోని గిరింపేటకు చెందిన యువతితో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో తరుచూ చిత్తూరు వెళ్లి ప్రియురాలిని కలసి వస్తుండేవాడు. అయితే, ఇటీవల కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆమెను కలుసుకునే వీలు పడలేదు. అయినప్పటికీ ఆమెను కలవాలని నిర్ణయించుకున్న యువకుడు కూరగాయల లారీలో ఆంబూరు నుంచి పలమనేరుకు చేరుకుని అక్కడి నుంచి ఓ ప్రైవేటు బ్యాటరీ కంపెనీ లారీలో తిరిగి స్వగ్రామానికి చేరుకుంటుండేవాడు.ఈ క్రమంలో వారం రోజుల క్రితం యువకుడు ప్రయాణించిన లారీని చిత్తూరు జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి అందులోని 20 మందిని క్వారంటైన్కు తరలించారు. ఈ క్రమంలో ఆంబూరు యువకుడికి కూడా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అలాగే, తిరుపత్తూరు ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు యువకుడు నివసించే ప్రాంతాన్ని సీల్ చేశారు. అలాగే, అతడితో కలిసి లారీలో ప్రయాణించిన కూరగాయల వ్యాపారులు, బ్యాటరీ కంపెనీ సిబ్బంది మొత్తం 220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.