గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అధినేతగా ఉన్న జగన్ ప్రచార సమయంలో కార్పోరేట్ కాలేజీల దోపిడీ గురించి పదే పదే ప్రస్తావించేవారు. తాము అధికారంలోకి వస్తే సదరు కార్పోరేట్ కాలేజీలకు చెక్ పెట్టడం ఖాయమని చెప్పేవారు. కానీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లితండ్రులు భావిస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది.ఒకటి నుంచి వందలోపు వెయ్యి ర్యాంకులంటూ టీవీలు, పేపర్లలో ప్రకటనలు చూసి మోసపోయి లక్షల రూపాయల ఫీజులు చెల్లంచి అయినా సరే ఇందులో సీటు పొందేందుకు విద్యార్ధులు క్యూ కడుతున్న పరిస్ధితి. చివరికి వీరందరికీ కనీసం చిన్నా చితకా ఉద్యోగాలన్నా వస్తున్నాయా అంటే అదీ లేదు. ఎవరో కొందరు ప్రతిభావంతులు మాత్రమే తాము కోరుకున్న కెరీర్ పొందగలుగుతున్నారు. దీంతో ప్రకటనలు చూసి మోసపోయి ఇక్కడికి వచ్చే సాధారణ విద్యార్ధులు మాత్రం లక్షల ఫీజులు పోసినా నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారు.ఈ పరిస్దితిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రస్తుతం రాష్ట్రంలోని కార్పోరేట్ కాలేజీలన్నీ ఒక్కో తరగతిలో దాదాపు వందమంది విద్యార్ధుల వరకూ అనుమతిస్తున్నాయి. డిమాండ్ ఆధారంగా ఇటువంటి తరగతులను 10 నుంచి 20 వరకూ కూడా నిర్వహిస్తున్న కాలేజీలు ఉన్నాయి. దీంతో కార్పోరేట్ దోపిడీకి చెక్ పెట్టేందుకు అడ్మిషన్లలో ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఇకపై క్లాసుకు గరిష్టంగా 40 మంది చొప్పున కనీసం 4 నుంచి గరిష్టంగా 9 సెక్షన్లు మాత్రమే ఉండేలా కార్పోరేట్ కాలేజీలు మార్పులు చేయాల్సిందే. తాజా మార్పులను ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది.విద్యార్ధుల నుంచి వచ్చే ఫీజులే తప్ప వారి భవిష్యత్తుపై ఏమాత్రం బెంగలేని కార్పోరేట్ కాలేజీల అధిపతులకు భారీ షాక్ ఇస్తూ అడ్మిషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసించి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం వీటిని పాటించకపోతే కాలేజీల గుర్తింపు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.అడ్మిషన్ నిబంధనలన్నింటినీ మార్చేస్తూ సర్కార్ జారీ చేసిన తాజా ఆదేశాలు కార్పోరేట్ పాఠశాలలు,కాలేజీల యాజమాన్యాలకు ఊపిరి ఆడనివ్వడం లేదు. కార్పోరేట్ దోపిడీకి చెక్ పెట్టడంతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు వీటి ద్వారా అవకాశం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.