ఏపీలో ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ… ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటిదాకా కొనసాగిన పార్టీలో తమకు దక్కిన గౌరవం – ఎదురైన చేదు అనుభవాలను బేరీజు వేసుకుంటున్న నేతలు.. వచ్చే ఎన్నికల్లో తమకు ప్రత్యామ్నాయాలేమిటని దృష్టి సారించడం సహజమే. ఇదే విషయాన్ని అవకాశంగా తీసుకుని ఇష్టం నేతలను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు – కీలక నేతలు కూడా తమదైన ప్లాన్లు అమలు చేస్తుంటారు. ఈ తరహా అపసవ్య ఆలోచనలు చేయడంలో టీడీపీని మించిన పార్టీ లేదని తాజా పరిణామాలను పరిశీలిస్లే ఇట్టే అర్థం కాక మానదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించుకుని వస్తారని అంచనాలు ఉన్న నేతలను కూడా బయటకు తరిమేయడంలో టీడీపీ తనదైన శైలి వ్యూహాలను అమలు చేస్తోందని చెప్పక తప్పదు. ఇందుకు ఉదాహరణే కడప జిల్లా రాజంపేటలో రాజుకున్న టీడీపీ కుంపటి.
గడచిన ఎన్నికల్లో కడప జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ… జగన్ ప్రభంజనం కారణంగా ఒక్క రాజంపేట అసెంబ్లీని మాత్రమే దక్కించుకుంది. అక్కడ కూడా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉంటూ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా మల్లికార్జున రెడ్డి విజయం సాధించారు. జిల్లా మొత్తం మీద ఒకే ఒక్క ఎమ్మెల్యేగా మేడా గెలవడంతో ఆయనకు చంద్రబాబు విప్ పదవిని కట్టబెట్టారు. అయితే వైఎస్ అనుచరుడని పేరుండటంతో ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే చెప్పాలి. గడచిన నాలుగున్నరేళ్లుగా పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలను పంటి బిగువుననే భరిస్తూ వస్తున్న మేడా… టీడీపీని వదలాలని ఏనాడూ అనుకోలేదు. అయితే టీడీపీ గ్రూపు రాజకీయాలు – వైసీపీ టికెట్ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించి ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు రాజంపేటలో మకాం పెట్టేశారు. మేడాను పక్కనపెట్టేసి… తన అనుచర వర్గానికి టికెట్ ఇప్పించుకోవాలని చాలా సైలెంట్గానే పావులు కదిపిన ఆది… మేడాకు తీవ్ర ఆగ్రహాన్నే తెప్పించారు. అయినా కూడా మేడా పార్టీ మారే యోచనకు రాలేకపోయారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని ఆ పదవి కాలం ముగియకుండా పార్టీ ఫిరాయించే ఆలోచన తన దరికే చేరనీయలేదు. అయితే టీడీపీ తరహా గ్రూపు రాజకీయాలు మేడాను పార్టీ వీడేలా చేశాయని చెప్పాలి.