హొసూరు : పట్టణంలో మూడు వేల మందికి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నందున ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల వారు ప్రజలకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేసి, ఉదారతను చాటుకుంటున్నారు. హొసూరు కార్పొరేషన్ పరిధిలోని చిన్నఎలసగిరిలో మాజీ కౌన్సిలర్లు ముత్తురాజ్, శివారెడ్డిలు గ్రామస్థుల సహకారంతో ఆ ప్రాంతంలో పని చేస్తున్న రెండు వేల మందికి పైగా కార్మికులకు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ అందరికీ కూరగాయలు అందించారు. సుమారు కిలోమీటరు మేరకు ప్రజలు క్యూలో నిలబడి ఒక్కొక్కరుగా కూరగాయలను తీసుకొని ఇళ్లకు వెళ్లారు. మాజీ కౌన్సిలర్లు ఇలా ఉచితంగా కూరగాయలను పంపిణీ చేయడంతో పట్టణంలో ఎంతో మందికి ఊరట కలిగింది.