హైదరాబాదు: ‘ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తి వేయకపోతే పేదల ఖాతాల్లో రూ.5,000 వేయాలి’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాలకు విన్నవించారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘సామాజిక మాధ్యమాల్లో కరోనా జిహాద్‌పై ట్రెండ్ చేస్తున్న వారు పాల్పడుతున్న వారు దేశాన్ని బలపర్చట్లేదు. మత విద్వేషాల సృష్టికి కుట్ర పన్నుతున్నారు.జనవరి నుంచి మార్చి 15 వరకు దేశానికి 15 లక్షల మంది విదేశాల నుంచి వచ్చారు. తబ్గిగీ జమాత్‌ను మాత్రమే ఎత్తి చూపెడుతున్నారు. మార్చి 3 పరీక్షల్ని ప్రారంభించారు. దీనికి బాద్యులు ఎవరు? వలసలు కార్మికులు ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా సోకి ఉండొచ్చు. వారు గ్రామాలకు వెళితే అక్కడా విస్తరిస్తుందని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పటం అసంబంధ్ధం. ఆరు లక్షల మందిని శిబిరాల్లో ఉంచామని అంటోంది. అక్కడ సామాజిక దూరం ఎలా పాటిస్తారు? పేదలు పడుతున్న ఇబ్బందుల పట్ల దృష్టిపెట్టాలని కోరుతున్నాను. వలసలు వచ్చిన వారు మన సోదరులు. ముస్లింలు సామాజిక దూరం పాటించాలి. మసీదుల వద్ద గూమి కూడ రాదు. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి. వైద్యులపై రాళ్లు రువ్వడం సరికాదని, వారు ప్రాణాల పణంగా పెట్టి పని చేస్తున్నార’ని చెప్పారు.