రోజురోజుకు మరింత వేగంగా విస్తరిస్తూ మానవాళిని కబళించడానికి ప్రయత్నిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు చేయని ప్రయత్నమంటూ లేదు.అన్ని దేశాలు కరోనా మహమ్మారిని అంతం చేయడానికి మందు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే దీనికి సమీప భవిష్యత్తులో మందు కనిపెట్టడం సాధ్యం కాదని తెలియడంతో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టి సారించాయి.అందులో భాగంగా అమెరికా వంటి అగ్రదేశాలు ప్లాస్మా థెరపీని ప్రత్యామ్నాయంగలా భావిస్తున్నాయి. ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న ఈ విధానం ఆశాజనకంగా ఉందని అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏఎస్)కు చెందిన ఓ జర్నల్ తెలిపింది.కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి రోగులకు ఎక్కించి ట్రీట్మెంట్ ఇవ్వడాన్నే ప్లాస్మా థెరఫీ అంటారు. దాంతో, ఈ విధానాన్ని భారత్లో కూడా ప్రయోగించాలని చూస్తున్నారు. మన దేశంలో కూడా ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎమ్ఆర్) తగిన మార్గనిర్దేశకాలు తయారు చేసే పనిలో ఉంది. వాటిని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి సమర్పించి ట్రయల్స్ కోసం ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తోంది.కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఈ థెరపీ మంచి మార్గమన్న అభిప్రాయాలు ఉన్నాయి. తొలుత చైనాలో పది మందికి ఈ విధానంతో చికిత్స అందించగా సత్ఫలితాలు వచ్చాయి. సీరియస్ కండిషన్లో ఉన్న ఈ రోగులకు ఒక డోస్ ప్లాస్మా థెరపీ ఇచ్చిన తర్వాత వారి ఆరోగ్యంలో పురోగతి కనిపించిందని సమాచారం. రోగులను వెంటిలేటర్ పై ఉంచి ఇతర దేశాల్లో కూడా ఈ థెరపీతో చికిత్స అందిస్తున్నారు.