డీఎంకే నాయకుడు మాదేశ్వరన్ పెద్ద మనసు

హొసూరు : డీఎంకే పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్ఎస్. మాదేశ్వరన్ రూ.లక్షకు పైగా విలువ చేసే నిత్యావసర వస్తువులను అమ్మ క్యాంటీన్‌కు ఉచితంగా వితరణ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హొసూరు ప్రాంతం నిర్జనంగా మారింది. హొసూరు మహా నగరంలో వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ఇక్కడ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు తిండి దొరక్క అల్లాడుతున్నారు. భిక్షాటన చేస్తున్న వారికి కూడా అన్నం దొరకడం దుర్లభమైంది. ఈ పరిస్థితులను గమనించిన మాజీ చైర్మన్ మాదేశ్వరన్ రూ.లక్ష విలువ చేసే బియ్యం, గోధుమ పిండి, వంట నూనె తదితర నిత్యావసర సరుకులను హొసూరు కార్పొరేషన్ అధికారులకు అప్పగించారు. హొసూరు పారిశ్రామికవాడలోని పరిశ్రమలలో పని చేస్తున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు భోజనాలకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఆయన వారందరికీ బియ్యం, వంట నూనె, కూరగాయలు, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. హొసూరులో పలు చోట్ల పట్టణవాసులకు ఉచితంగా కూరగాయలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాదేశ్వన్ మాట్లాడుతూ వేల మంది కార్మికులు పరిశ్రమలలో పని చేస్తున్నారని, లాక్‌డౌన్‌ పరిణామంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిని గమనించి వారికి నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేశానని చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల పలువురు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన మాదేశ్వరన్, తానున్నానంటూ….వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా పట్టణవాసుల ప్రశంసలను అందుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos