ముంబయి: దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లడంతో పాటు ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అటు ఆసియా మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సూచీలకు నష్టాలు తప్పలేదు.మంగళవారం ఆరంభం నుంచే మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో నేటి ట్రేడింగ్‌ను సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టంతో బలహీనంగా ప్రారంభించింది. నిఫ్టీ కూడా 10,950 మార్క్ దిగువన ట్రేడ్ అయ్యింది. ఆ తర్వాత సూచీలు మరింత దిగజారాయి. ఒక దశలో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 10,900 దిగువకు పడిపోయింది. అయితే చివర్లో సూచీలు కాస్త కోలుకుని నష్టాలను తగ్గించుకున్నాయి. నేటి సెషన్‌లో సెన్సెక్స్ 134 పాయింట్లు నష్టపోయి 36,445 వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 10,923 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.40గా కొనసాగుతోంది.ఎన్‌ఎస్‌ఈలో సన్‌ఫార్మా, విప్రో, టైటాన్, కొటక్ మహింద్రా బ్యాంక్, రెడ్డీస్ ల్యాబ్స్ లాభపడగా.. వేదాంతా, టాటాస్టీల్, మహింద్రా అండ్ మహింద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ షేర్లు నష్టపోయాయి.