లక్నో: ఈవీఎంల వ్యవహారం మరోసారి రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగినట్టు ఇండియన్ సైబర్ ఎక్స్‌పర్ట్ ఒకరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి స్పందించారు. మళ్లీ బ్యాలెట్ పేపర్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకురావాలని అన్నారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈవీఎంల అంశాన్ని ఈసీ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బ్యాలెట్ పేపర్‌ను అయితే సరిచూసుకోవచ్చని, ఈవీఎంను సరిచూసుకోవడం కుదరదని ఆమె అన్నారు. 2019 ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికల సంఘం నిర్వహించాలని కోరారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్‌తో దేశ ప్రజలు బెంబేలెత్తారు. తమ ఓటు తమది కాకుండా పోయిందనే అభిప్రాయానికి వచ్చారు. వారి ఓట్లను వివిథ గ్రూపులు లూటీ చేసాయి. ఆ కారణంగానే బీజేపీ అటు కేంద్రంలోనూ, అత్యధిక రాష్ట్రాల్లోనూ అదికారంలోకి రాగలిగింది. పేదలు, కష్టపడి పనిచేసే ప్రజానీకం భవిష్యత్తు ఆందోళనలో పడేలా వాళ్లు చేశారు’ అని మాయావతి ఆరోపించారు.