న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా అడుగుపెట్టకుండా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అధికార బలంతో అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మాల్ధా ఎయిర్‌పోర్ట్‌లో అమిత్ షా విమానం ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ వాడకానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే అదే హెలిప్యాడ్‌లో కొద్ది రోజుల కిందట మమతా హెలికాఫ్టర్ ల్యాండ్ అయిందని, అక్కడికి మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారని ఆ ప్రదేశం శుభ్రంగా, సురక్షితంగా ఉండటం తాను చూశాననన్నారు. అక్కడ హెలికాఫ్టర్లు బాగానే ల్యాండవుతాయని చెప్పుకొచ్చారు. భద్రతా కారణాలు సాకు చూపి అక్రమ పద్ధతుల్లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించారని ఆయన ఆరోపించారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే అమిత్ షా విమానం దిగేందుకు మాల్దా ఎయిర్పోర్ట్ వర్గాలు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు మమతా సర్కార్‌పై భగ్గుమంటున్నారు.
బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు మరికొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్టు వస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా బదులిచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు.ఈవీఎంల హ్యాకింగ్ కాంగ్రెస్ కుట్రగా ఆయన అభివర్ణించారు. సార్వత్రికి ఎన్నికలు జరిగే సమయానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని ఆయన గుర్తు చేశారు. 2014లో దేశప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.లండన్‌లో జరిగిన ఈవెంట్‌కు కపిల్ సిబాల్ ఎందుకు హాజరయ్యారని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంల హ్యాకింగ్‌తోనే 2014లో ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోండటంతో రాజకీయంగా కలకలం రేగింది.