బడ్జెట్‌ చూడటమంటే సమయం వృథా: బజాజ్‌

  • In Money
  • January 22, 2019
  • 978 Views
బడ్జెట్‌ చూడటమంటే సమయం వృథా: బజాజ్‌

న్యూదిల్లీ: బడ్జెట్‌ను చూడటమంటే నాలుగు గంటల సమయాన్ని వృథా చేసుకోవడమే అని వ్యాఖ్యానించారు బిజినెస్‌ టైకూన్‌ రాజీవ్‌ బజాజ్‌. ఒక పక్క పారిశ్రామిక వేత్తలు బడ్జెట్‌కు తమ ఆకాంక్షలను వెల్లడించడంలో బిజీగా ఉండగా బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. తాను ప్రభుత్వం నుంచి ఏమీ కావాలని ఆశించడంలేదని పేర్కొన్నారు. గత 28 ఏళ్లుగా తాను బడ్జెట్‌ను చూడటంలేదని వెల్లడించారు. బడ్జెట్‌ చూడటానికి నాలుగు గంటల సమయాన్ని వృథా చేసే బదులు మనం చేస్తున్న పనిపై ఆ సమయం వెచ్చించడం మేలని తెలిపారు. భవిష్యత్తులో కూడా బడ్జెట్‌ చూసేందుకు సమయం వెచ్చించనని చెప్పారు.మధ్యంతర బడ్జెట్‌ నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారని కొందరు రాజీవ్‌ బజాజ్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘‘నేను బజాజ్‌ కుటుంబానికి చెందిన వాడినైనా గత 28ఏళ్లుగా బడ్జెట్‌ను ఒక్కసారి కూడా చూడలేదంటే మీరు ఆశ్చర్యపోతారు. బడ్జెట్‌ చూడటం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పటి వరకు విలువైనది ఏదీ బడ్జెట్‌లో కనిపించలేదు. ఇది మా కంపెనీపై ఎటువంటి ప్రభావం చూపదు. ఏదైనా ముఖ్యమైన విధానపర నిర్ణయాలు ఉంటే వాట్సాప్‌ ద్వారా మా వాళ్లు సమాచారం ఇస్తారు’’  అని పేర్కొన్నారు. బడ్జెట్‌ కార్యక్రమాన్ని దేశంలో పారిశ్రామిక వేత్తలు తప్పనిసరిగా చూస్తారు. దీనికి ముందు ప్రభుత్వం కూడా పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తుంది.రాజీవ్‌ బజాజ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఇదే తొలిసారి కాదు. మోటార్‌ సైకిళ్లపై 28శాతం జీఎస్టీ అన్న అంశంపై కూడా ఆయన స్పందించారు. ‘‘ దేశంలో మోటార్‌ సైకిళ్లు విలాసవంతమైన వస్తువులు అని పేర్కొనడంలో హేతుబద్ధత లేదు. విలాసవంతమైన వస్తువులపై 28శాతం జీఎస్టీ విధించాలనుకుంటే మోటార్‌ సైకిళ్లపై 18శాతం జీఎస్టీ విధించడం సహేతుకం.’’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos