హైదరాబాదు: తన రేంజ్ రోవర్ కారుకు ఫాన్సీ నెంబర్ కోసం గూడూరు శివరామకృష్ణ ఏకంగా దాదాపు రూ.9 లక్షలు వెచ్చించాడు. రంగారెడ్డి జిల్లా ఉపరవాణాధికారి కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం నిర్వహించిన వేలం పాటలో టీఎస్ 07 హెచ్ ఈ 9999 నంబర్ కోసం వాహనాల యజమానులు బాగా పోటీ పడ్డారు. ఎట్టకేలకు శేరిలింగంపల్లికి చెందిన గూడూరు శివరామకృష్ణ 8 లక్షల 66 వేల 116 రూపాయలకు దీన్ని దక్కించుకున్నారు. ఒక ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత పెద్ద మొత్తం ఆదాయం రావడం ఇదే మొదటిసారని జిల్లా రవాణాధికారులు తెలిపారు. వివిధ ఫ్యాన్సీ నెంబర్ల కోసం నిర్వహించిన వేలం పాటలో మొత్తం 11 లక్షల 39 వేల 641 రూపాయల ఆదాయం లభించిందన్నారు.