అమరావతి : తెదేపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వైకాపాలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు పార్టీ కండువా వేసి వైకాపాలోకి ఆహ్వానించారు. డొక్కా ఈ ఉదయమే తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. 2019 ఎన్నికల వేళ చివరి నిమిషంలో ప్రత్తిపాడు సీటు కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమి పాలవుతానని తెలిసినా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసినట్లు లేఖలో డొక్కా పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో శాసన మండలి సమావేశాలు వివాదాస్పదం అవుతాయని ఊహించే సభకు హాజరు కాలేదని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఆయన జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు.