హొసూరు : ఇక్కడికి సమీపంలోని అచెట్టిపల్లి గ్రామంలో పాత కక్షల కారణంగా స్నేహితునిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన సంచలనం సృష్టించింది. అచెట్టిపల్లికి చెందిన వెంకటస్వామి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతని స్నేహితుడు రమేష్, మరో ముగ్గురు కలిసి గ్రామ సమీపంలో మద్యం సేవిస్తుండగా వీరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఈ గొడవలో రమేష్ వెంకటస్వామిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన వెంకటస్వామి అరుపులు విని స్థానికులు అతనిని హొసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మత్తిగిరి పోలీసులకు సమాచారం అందడంతో వెంకటస్వామిని విచారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పాత కక్షల కారణంగా రమేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. రమేష్, అతని స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.