వ్యాపిస్తున్న కరోనా

సియోల్‌ : కరోనా వైరస్‌ దేశాలు, ఖండాలను దాటుతోంది. 50 దేశాలను కాల మేఘంలా కమ్మేసింది. న్యూజిలాండ్‌, నైజీరియా, నెదర్లాండ్స్‌ సహా 48 గంటల్లో కొత్తగా 12 పైగా దేశాల్లో కేసులు నిర్ధారణ కావడంతో ఇది మహమ్మారిగా మారగల వైర్‌స్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ  పేర్కొంది. ‘వైరస్‌ కమ్ముకొస్తోంది.. జాగ్రత్త’అని తీవ్ర స్థాయి హెచ్చరిక జారీ చేసింది. జన్మ స్థానమైన చైనాలో కేసులు, మరణాలు తగ్గుతుండగా దక్షిణ కొరియాలో పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతోంది. శుక్రవారంతో కేసుల సంఖ్య 2,337కు (వీటిలో 571 కొత్తవి), మృతుల సంఖ్య 13కు చేరింది. దీంతో జాతీయ ప్రభుత్వం డ్యెగూ నగరంలోని షించియోంజీ చర్చి ఆరాధకులు 3.10 లక్షల మంది వివరాలు సేకరించాలని ఆదేశించింది. కరోనాతో ఇరాన్‌ పార్లమెంట్‌ను మూసివేశారు. కరోనా దెబ్బతో శుక్రవారం దక్షిణ కొరియా స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. సూచీలు 2011 నాటి కనిష్ఠానికి పడిపోయాయి. ఈ ఒక్క వారంలోనే విదేశీ పెట్టుబడిదారులు రూ.23 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించేశారు. అన్ని షేర్ల విలువ 2.6 శాతం పడిపోగా, దిగ్గజ హ్యుందాయ్‌ సంస్థ షేర్ల విలువ ఏకంగా 5 శాతంపైనే పతనమైంది. ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చేందుకు అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ కొరియా, జపాన్‌ దేశీయులకు వీసా ఆన్‌ అరైవల్‌ను భారత్‌ రద్దు చేసింది. మూడు వారాల్లో పరిస్థితి అదుపులోకి రాకుంటే సవాలేనని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం చైనాలో 44 మరణాలు, 327 కేసులు నమోదయ్యాయి. గత 35 రోజుల్లో ఇదే అతి తక్కువ. మొత్తం మరణాలు 2,788కి చేరాయి. కరోనా లక్షణలున్నా వెయ్యి మందిని జర్మనీ అంటు వ్యాధుల (నియంత్రణ) వార్డులకు తరలించింది. హాంకాంగ్‌లో తక్కువ స్థాయిలో అయినా ఓ పెంపుడు శునకంలో కరోనా లక్షణాలు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వాల సన్నద్ధతపై అమెరికా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos