బెంగళూరు : నగరంలోని బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శనా కేంద్రంలో ఈ నెల 6 నుంచి తొమ్మిదో తేది వరకు స్టోనా-2020 పేరిట గ్రానైట్ రాళ్ల ప్రదర్శన జరుగనుంది. దేశ, విదేశాలకు చెందిన 550 మంది ప్రదర్శకులు పాల్గొంటారని నిర్వాహకులు సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. గ్రానైట్ పరిశ్రమలకు అవసరమయ్యే అత్యాధునికి యంత్రోపకరణాలు కూడా ప్రదర్శనలో చోటు చేసుకుంటాయని చెప్పారు. వందకు పైగా ప్రముఖ కొనుగోలుదార్లు ప్రదర్శనను తిలకించి, అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీల నిర్వహణకు తోడ్పడతారని వివరించారు. చేతితో తయారు చేసిన గ్రానైట్ కళా రూపాలను ప్రదర్శనలో తిలకించవచ్చన్నారు. ఇదే సందర్భంలో వివిధ అంశాలపై సెమినార్లను కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహా దేశంలోని వివిధ రాష్ట్రాలు డైమన్షనల్ గ్రానైట్ బ్లాక్‌లను ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. 2018లో భారత్ నుంచి రూ.14 వేల కోట్ల విలువైన గ్రానైట్ ఎగుమతి జరిగిందని తెలిపారు. విలేకరుల సమావేశంలో స్టోనా-2020 కో-చైర్మన్ జితేంద్ర కొఠారి, చైర్మన్ మనోజ్ కుమార్ సింగ్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ గ్రానైట్ అండ్ స్టోన్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఇష్విందర్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఎస్. కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.