బెంగళూరు : భారతీయ పాలనా సేవ (ఐఏఎస్). ఎలాగైనా దీనిని సాధించాలని యువత ఉవ్విళ్లూరుతుంటుంది. సాధారణ గ్రాడ్యుయేట్ మొదలు అసాధారణ డాక్టర్లు, ఇంజనీర్లు దీని కోసం ఆరాటపడుతుంటారు. రోజుకు 15 గంటలకు పైగా కష్టపడి, దీనిని సాధించేవరకు విశ్రమించబోమని శపథం చేస్తుంటారు. దీని కోసం ప్రత్యేక శిక్షణ నిమిత్తం అభ్యర్థులు తమ ఆర్థిక స్తోమతను బట్టి ఆయా రాష్ట్రాల రాజధానుల మొదలు ఢిల్లీ వరకు వెళుతుంటారు. ఈ ప్రయత్నంలో సఫలీకృతులయ్యేది కొందరు మాత్రమే. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో కండక్టరుగా పని చేస్తున్న మధు, ఆ స్వప్నాన్ని సాత్కారం చేసుకునే దిశగా సాగుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన మధు దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి, 19 ఏళ్ల వయసులోనే కండక్టరుగా చేరాడు. ఐఏఎస్ అతని జీవిత లక్ష్యం. దీని కోసం రోజూ అయిదు గంటలు కష్టపడుతున్నాడు. ఒక వైపు కండక్టరు ఉద్యోగం చేస్తూనే తన స్వప్న సాక్షాత్కారానికి శ్రమిస్తున్నాడు. ప్రిలిమ్స్‌లో పాసైన మధు మెయిన్స్‌లో కూడా ఉత్తీర్ణత సాధించాడు. మార్చి 25న జరుగనున్న ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నాడు. అతని కల ఫలించాలని అందరమూ ఆశిద్దాం. మండ్య జిల్లా మళవళ్లి గ్రామానికి చెందిన వాడు మధు.