బెంగళూరు : యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి సంప్రదాయ శిక్షణతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని కర్ణాటక నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ తెలిపారు. బుధవారం ఇక్కడ యువతకు విద్య, శిక్షణ, ఉపాధి అవకాశాలను విస్తృతపరచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బహుళ సంస్థల భాగస్వామ్య కార్యక్రమం `యువా’ను ప్రారంభించిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. యువతకు సాధికారత, నైపుణ్యాభివృద్ధిని కల్పించడమే కేంద్రంలోని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం, రాష్ట్రంలో యడియూరప్ప నేతృత్వంలోని సర్కారుల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ ప్రయత్నంలో యునిసెఫ్ తమతో చేతులు కలపడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా తయారు చేసిన నివేదికను తదుపరి చర్యల కోసం ప్రభుత్వం ముందుంచుతామని తెలిపారు. ఉపాధి కల్పన ప్రక్రియలో కేవలం పట్టణ యువతపైనే కాకుండా గ్రామీణ యువతపై కూడా దృష్టిని కేంద్రీకరించడం ముఖ్యమన్నారు. ఉత్తర కర్ణాటకతో పాటు, హైదరాబాద్-కర్ణాటకలోని యువతను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, ప్రణాళిక కార్యదర్శి శాలిని రజనీష్, యునిసెఫ్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మీటల్ రస్దియా ప్రభృతులు ప్రసంగించారు.
కర్ణాటక నైపుణ్యాభివృద్ధి సంస్థ, యునిసెఫ్ సంయుక్తంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారు పొల్గొన్నారు. ఉపాధి అవకాశాల విస్తృతికి, ఆ కార్యక్రమాలను అమలు చేయడానికి రోడ్డు మ్యాప్‌ను రూపొందించారు. బాలల హక్కులు, నైపుణ్యాభివృద్ధి రంగాలకు చెందిన నిపుణులతో పాటు ప్రభుత్వ, పౌర సమాజ సభ్యులు, యువత పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పారు.