ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు,అభ్యర్థులు పడేపాట్లు అన్నిఇన్నీ కావు.పార్టీలు తమకు బీఫారాలు ఇచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరిగే రోజు వరకు పగలురాత్రి తేడా లేకుండా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటారు.ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు,అభ్యర్థులు చేసే కసరత్తులు,ప్రలోభాలు తదితరవాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఇక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలో నల్గొండ జిల్లా చండూరు మండలం లకినేని గూడెం గ్రామంలో అభ్యర్థి చేసిన పని చర్చనీయాంశమైంది. ఇక్కడి మూడో వార్డు పరిధిలో దాదాపు 800 మందికి పైగా నివాసం ఉంటుండగా, సుమారు 520 ఓట్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ, ఆయా పార్టీలు ఓట్ల కోసం అందరినీ గ్రామం నుంచి తరలించడంతో ఇప్పుడా గ్రామం బోసిపోయింది.ఓటర్లను సమీపంలోని కోళ్లఫామ్‌లకు తరలించిన అభ్యర్థి వారికి అవసరమైన సమస్త సౌకర్యాలనూ కల్పిస్తున్నారు.నిన్న ఉదయం ఓటర్లను తరలించిన అభ్యర్థి, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి విందు, ఆపై మద్యం తదితరాలను సరఫరా చేసినట్టు సమాచారం. ఇక మందు కొట్టిన తరువాత ఎవరైనా వివాదాలకు దిగుతారని భావించిన అభ్యర్థులు వారిని గ్రూపులుగా విడదీసి దూరంగా ఉండే ఇతర షెడ్లలో విశ్రాంతి ఏర్పాట్లను చేశారట.