వారణాసి : ఇక్కడి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో భాజపా అనుబంధ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం నాలుగు సీట్లను కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ కైవసం చేసుకుంది. విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఎన్‌ఎస్‌యూఐకి చెందిన శివమ్ శుక్లా, ఏబీవీపీ నాయకుడు హర్షిత్ పాండే మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే ఎన్‌ఎస్‌యూఐకి చెందిన చందన్ కుమార్ ఉపాధ్యక్షుడుగా, అవ్నీశ్ పాండే జనరల్ సెక్రటరీగా, రజనీకాంత్ దుబే గ్రంథాలయ విభాగం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి ప్రొఫెసర్ శైలేష్ కుమార్ ఫలితాలు ప్రకటించిన తరువాత.. యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజరామ్ శుక్లా వారి చేత సంస్కృతంలో ప్రమాణం చేయించారు. అలాగే వివాదాలకు దూరంగా ఉండేందుకు గెలిచిన అభ్యర్థులు క్యాంపస్‌లో ఊరేగింపు చేపట్టరాదని శుక్లా సూచించారు. గెలిచిన ఎన్‌ఎస్‌యూఐ నేతలు వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు పోలీసు భద్రత కల్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం పరిధిలోని యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా ఏబీవీపీ ఒక్క సీటులోనూ గెలుపొందని సంగతి తెలిసిందే. కాగా మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా భాజపా దారుణంగా ఓడిపోయింది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్‌లో భాజపాకు తొలి నుంచీ గట్టి పట్టుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఈ ప్రాంతానికి చెందిన వారే. నాగపూర్‌లో 59 జడ్‌పీ స్థానాలుండగా, భాజపా కేవలం పది చోట్ల మాత్రమే గెలుపొందగలిగింది. కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి 38 స్థానాల్లో విజయ బావుటాను ఎగురవేసింది.