జోద్‌పూర్ (రాజస్థాన్): పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుండ బద్ధలుకొట్టారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో నిర్వహించిన సీఏఏ అవగాహన ర్యాలీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు ఈ చట్టం విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయని మండిపడ్డారు. ఈ చట్టం పౌరసత్వాన్ని అందజేసేదే తప్ప, ఎవరి పౌరసత్వాన్ని తీసుకోజాలదన్నారు. మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయని ఆరోపించారు. సత్తా ఉంటే తనతో చర్చకు రావాలని సవాలు విసిరారు. అదీ కాకుంటే తాను ఇటాలియన్‌లో దాన్ని తర్జుమా చేసి ఇస్తా… చదువుకుని తెలుసుకోండని ఎద్దేవా చేశారు.