రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరిస్తున్నారు

రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరిస్తున్నారు

పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన సభ చారిత్రాత్మక సభ అని, దేశప్రజల్లో ఈ సభ భరోసానిచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే సభ అమరావతిలో పశ్చిమబెంగాల్‌లో జరిగిన సభ కంటే దీటుగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సభకు 22 పార్టీలకు చెందిన నేతలు ఇందులో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని, మోదీ నెగెటివ్ లీడర్‌గా మారారని విమర్శించారు. విభజన జరిగిన తర్వాత ఏపీకి బీజేపీ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా ఏపీకి చాలా తక్కువగానే నిధులిచ్చారని పేర్కొన్నారు. ఏపీకి వారానికో కేంద్రమంత్రి వస్తారట, రాష్ట్రానికి ఏం మేలు చేశారని వస్తున్నారని, పైగా బెదిరింపులకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులకు దిగుతున్నారని, వాళ్ల బెదిరింపులకు భయపడే వారెవరూ ఇక్కడ లేరని అన్నారు. టీఆర్‌ఎస్, వైసీపీ లాలూచీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. గతంలో కేసీఆర్ వైఎస్‌ని నిందించారని, కానీ ఇప్పుడు అదే కేసీఆర్ వైఎస్‌ని తెగ పొగిడేస్తున్నారని అన్నారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయి వారం రోజులైనా కాలేదు, జగన్ వెంటనే కేసీఆర్‌కి లేఖ రాశారని, నిన్న అసెంబ్లీలో వైఎస్‌ను కేసీఆర్ పొగిడారని చంద్రబాబు అన్నారు. మోదీ డైరెక్షన్‌లోనే టీఆర్‌ఎస్, వైసీపీలు పనిచేస్తున్నాయని, బీసీలలో లేనిపోని అపోహలు సృష్టించి, వారిని టీడీపీకి దూరం చేసే కుతంత్రాలు పన్నుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఈ కుట్రలు చేసే మూడు పార్టీల పట్ల నేతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కోరారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos