హొసూరు : సీనియర్ జర్నలిస్టు మునిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాత్రికేయ వృత్తిలో ఉంటూనే తమిళనాట తెలుగు భాష వికాసానికి పాటు పడ్డారని మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్ శ్లాఘించారు. ఇక్కడి ఆంధ్ర సాంస్కృతిక సమితి భవనంలో ఆదివారం సత్యనారాయణ రెడ్డి చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మనోహరన్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. సత్యనారాయణ రెడ్డి హఠాన్మరణం తమిళనాట తెలుగు భాషాభివృద్ధికి తీరని లోటని పేర్కొన్నారు. పాత్రికేయ వృత్తిలో ఆయన నిఖార్సుగా వ్యవహరించారని, హొసూరు ప్రాంతంలో తెలుగు పత్రికలు ఇబ్బడిముబ్బడిగా రావడానికి కృషి చేశారని కొనియాడారు. ఆయన చిత్ర పటాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ద్వారా ఇక్కడి తెలుగు వారు సదా ఆయనను స్మరించుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకట రెడ్డి, స్థానిక ప్రముఖులు చిన్న గుట్టప్ప, బత్తలపల్లి గోపాల్, హొసూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కార్ముగిల్, స్థానిక పాత్రికేయులు జేసురాజ్, దేవ బాలమురుగన్, శ్రీధర్, మారిముత్తు ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి సతీమణి సరిత, కుమార్తెలు అక్షయ, శ్రీతనలకు ప్రెస క్లబ్ తరఫున చెక్కును అందజేశారు. ఇటీవల మరణించిన స్థానిక తెలుగు పాత్రికేయుడు ఏపీ. సురేశ్‌కు నివాళులర్పించారు.