ముగ్గులేసి జైలుకెళ్లారు..

ముగ్గులేసి జైలుకెళ్లారు..

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి.ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ,ఉత్తరప్రదేశ్‌,పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో నిరసనలు హింసాత్మకంగా మారగా మిగిలిన రాష్ట్రాల్లో నిరసనలు ర్యాలీల వరకే పరిమితమయ్యాయి.ఇక పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కూడా చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో చెన్నై నగరంలోని కొంత మంది మహిళలు ఎన్‌ఆర్‌సీ,సీఏఏలకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు తెలిపి కటకటాల పాలయ్యారు. చెన్నైలోని బీసెంట్ నగర్‌లో ఉంటున్న డీఎంకే పార్టీకి చెందిన మహిళా విభాగం కార్యకర్తలు గాయత్రి, మదన్, ఆర్తి, కల్యాణి, ప్రగతి మరో ఇద్దరు మహిళలు రోడ్డలపై ముగ్గులు వేయడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. `సే నో టు సీఏఏ, సే నో టు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్..` ముగ్గులు వేశారు. బీసెంట్ నగర్ మొత్తం అలాంటి ముగ్గులే కనిపించాయి.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బీసెంట్ నగర్ కు చేరుకున్నారు. ముగ్గులు వేస్తోన్న ఏడుమంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు.గాయత్రి, మదన్, ఆర్తి, కల్యాణి, ప్రగతి సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసు వ్యానులో వారిని జే 5 శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కొద్ది సేపటి అనంతరం బెయిల్‌ రావడంతో విడుదల చేశారు.తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోంటే పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos