ఫుడ్‌ డెలి‘వర్రీ’ డ్రైవర్లు జరజాగ్రత్త..!

ఫుడ్‌ డెలి‘వర్రీ’ డ్రైవర్లు జరజాగ్రత్త..!

నగరంలో  ‘ఇంటి వద్దకే ఫుడ్‌ డెలివరీ’ చేసే కంపెనీల వాహన చోదకులు ఇకపై జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో సైబరాబాద్‌ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఫుడ్‌ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జోమాటో, ఉబర్‌ ఈట్స్‌ తదితర సంస్థలకు చెందిన అధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్‌ అధ్యక్షతన ఆదివారం ‘సెన్సిటైజేషన్‌ కమ్‌ సేఫ్టీ’ సమావేశం నిర్వహించారు.ఫుడ్‌ డెలివరీ వాహనాల ప్రమేయమున్న ప్రజల భద్రత, రోడ్డు భద్రత,  శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్, శాంతిభద్రతలు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు.  

తీరు మార్చుకోవాల్సిందే…
మద్యం తాగి వాహనం నడపడం, ర్యాష్‌ డ్రైవింగ్, వ్యతిరేక దశలో డ్రైవింగ్, సిగ్నల్‌ జంపింగ్, హారన్లు ఇష్టారీతిన మోగించడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్, నంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ తదితర చర్యలతో ప్రజల్లో ఫుడ్‌ డెలివరీ వాహనచోదకులు ఆందోళన కలిగిస్తున్నారు. మొదటిసారి కావడంతో ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నామని, తీరు మార్చుకోకపోతే ట్రాఫిక్‌ పాయింట్‌ సిస్టమ్‌తో కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిథులను సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్లపై ఆయా కంపెనీలు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే డ్రైవర్లను తీసుకునే సమయంలో వారి పూర్వపరాలు, కస్టమర్‌ డాటా నిర్వహణ, డ్రైవర్లకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన, ప్రజా సమస్యల పరిష్కరానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అయితే ట్రాఫిక్‌ నిబంధనలు తరచూ అతిక్రమించే వారిపై నిఘా వేసి తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు పోలీసులకు హామీ ఇచ్చారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఈ సమావేశానికి ఆహ్వనించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించే తమ కంపెనీ వాహన డ్రైవర్లపై కఠినంగా ఉంటామన్నారు. సమావేశంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్, ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీలు ప్రవీణ్‌కుమార్, అమర్‌కాంత్‌ రెడ్డి, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ భాస్కర్‌ పాల్గొన్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos