కజకిస్థాన్ లోని నూర్ సుల్తానా సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బెక్ ఎయిర్ కు చెందిన విమానం ఆల్ మటీ నగరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోగా, ఆపై క్షణాల్లోనే రెండతస్తుల భవనాన్ని ఢీ కొట్టి కూలిపోయింది. విమానంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.విషయం తెలుసుకున్న అధికారులు, వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. విమానంలోని వారిలో కొంతమంది తీవ్ర గాయాలతో బయటపడినట్టు తెలుస్తుండగా, ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కజకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.