న్యూ ఢిల్లీ: ఉల్లి ఎగుమతుల్ని టర్కి నిలిపేయటంతో ఎర్ర గడ్డల ధరలు మళ్లీ ఘాటెక్కనున్నాయి. రానున్న రోజుల్లో 10 నుంచి 15 శాతం వరకూ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో ఏర్పడిన ఉల్లి కొరత నివారణకు కేంద్రం టర్కీ, ఈజిప్టుల నుంచి పెద్ద ఎత్తున ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ 7,070 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంది. ఇందులో 50 శాతం టర్కీదే. ఎగుమతుల వల్ల టర్కీలో కూడా ఉల్లి ధరలు పెరిగినందున ఉల్లి ఎగుమతుల నిలిపివేతకు ఆ దేశం నిర్ణయించింది. ‘మనలాగే టర్కీ కూడా ధరల నియంత్రణ కోసం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది’ అని నాసిక్‌లోని టోకు వ్యాపారి ఒకరు తెలిపారు.