ఉదయగిరి : ఇక్కడి నుంచి తిరుపతి ఎక్స్‌ప్రెస్ బస్సులో నెల్లూరు వెళ్లాలంటే ప్రయాణికులు అదనపు మొత్తం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఉదయం నాలుగు గంటలకు ఉదయగిరిలో బస్సు బయల్దేరుతుంది. నెల్లూరు వెళ్లే ప్రయాణికుల నుంచి రూ.5 అధికంగా వసూలు చేస్తున్నారు. బస్సు ఆత్మకూరు పట్టణంలోకి వెళుతుంది కనుక పెరిగిన కిలోమీటర్ల మేరకు రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ సిబ్బంది సెలవిస్తున్నారు. అయితే తిరుపతి ప్రయాణికుల కోసమే బస్సు ఆత్మకూరులోకి వెళుతుందనే విషయం ప్రయాణికులకు తెలియదని ఆర్టీసీ అధికారులు అనుకున్నట్లుంది కాబోలు. సాధారణంగా ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్లే బస్సులు నెల్లూరుపాలెం మార్గంలో వెళ్లిపోతాయి. దీనివల్ల దాదాపు 15 నిమిషాల సమయం కలసి వస్తుంది. ఆర్టీసీ ఆదాయం కోసం ఆత్మకూరు పట్టణంలోకి తీసుకు వెళుతూ ఆ భారాన్ని ప్రయాణికులపై మోపడం ఆర్టీసీ అధికారులకే చెల్లింది. దీనివల్ల నెల్లూరు వెళ్ళవలసిన ప్రయాణికులు మరో బస్సు వచ్చేంతవరకు ఆగి ఉండాల్సి వస్తోంది. ఈ బస్సు తిరుగు ప్రయాణంలో సైతం ఆత్మకూరు పట్టణం మీదుగా ఉదయగిరి చేరుతుంది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి.