న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన సమీక్ష వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం బుధవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యంలో ఇప్పటికే అన్ని విచారణలు ముగిసినందున తీర్పును మరోసారి పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అక్షయ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్.. ‘మాధ్యమాలు, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే నా క్లయింట్ను దోషిగా తేల్చారు. అక్షయ్ చాలా పేద వ్యక్తి, అమాయకుడు. తప్పుడు ఆధారాలతో తనను ఈ కేసులో ఇరికించారు. నిర్భయ మరణ వాంగ్మూలంలోనూ అనుమానాలున్నాయి. మరణించే ముందు నిర్భయ ఇచ్చిన వాంగ్మూలంలో అక్షయ్ పేరు ఎక్కడా చెప్పలేదు. పుట్టుకతోనే ఎవరూ అత్యాచారులు కారు. ఈ సమాజమే వారిని అలా మారుస్తుంది. సరైన విద్య లేకపోవడం వల్లే చాలా మంది నేరస్థులుగా మారుతున్నారు. ఇప్పటికే దిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారి మనుషుల ఆయుర్దాయాన్ని తగ్గిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా మరణశిక్ష వేయాల్సిన అవసరం ఏముంద’ని అక్షయ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ప్రశ్నించారు. సమీక్ష వ్యాజ్యాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. దిల్లీ ప్రభుత్వం తరఫున వాదించారు. ‘కొన్ని నేరాలు మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోతాయి. ఇది కూడా అలాంటిదే. ఈ కేసులో దోషి(అక్షయ్)కి సానుభూతి పొందే అర్హత కూడా లేదు. ఇలాంటి రాక్షసుడిని పుట్టించినందుకు, బాధితురాలిని కాపాడుకోలేకపోయినందుకు ఆ దేవుడు కూడా సిగ్గుపడుతాడు’ అని వ్యాఖ్యానించారు. శిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో దోషుల పట్ల దయ చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.