న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సవరించిన పౌరసత్వ చట్టాన్ని కేంద్రం అమలు చేయకుండా అడ్డుకు నేందుకు అత్యున్నత న్యాయ స్థానం బుధవారం నిరాకరించింది. చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీకరించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి తాఖీదుల్ని జారీ చేసింది. జనవరి రెండో వారంలోగా బదులివ్వాలని ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే జన వరి 22కు వాయిదా వేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, ఇండియన్ యూని యన్ ముస్లిం లీగ్, అసోం గణ పరిషత్, మక్కల్ నీది మయం(కమల్ హాసన్ పార్టీ), మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహా పలు రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు దాదాపు 60 వ్యాజ్యాల్ని దాఖలు చేసారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలో న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.