అధికార,ప్రతిపక్షాల ఆరోపణలు,విమర్శలతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఆంగ్లమాధ్యం,ఇసుక,పోలవరం ఇలా ప్రతి అంశంపై ఇరు పక్షాల సభ్యులు ఆరోపణలు,విమర్శలతో చెలరేగిపోతున్నారు.ఈ క్రమంలో సోమవారం సభలో తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని చేసిన వ్యాఖ్యలతో అధికార,పత్రిపక్షాల సభ్యులను నవ్వుల్లో ముంచెత్తాయి.మద్యపాన నిషేధం గురించి ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో ఇళ్ల మధ్యలో, దేవాలయాలు,పాఠశాలల వద్ద కూడా చాలాచోట్ల మద్యం దుకాణాలు ఉన్నాయని వీటి వల్ల దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ ఇప్పుడు దశలవారీ నిషేధం అంటున్నారని ఇది మాట తప్పడం కాదా అంటూ ప్రశ్నించారు.మద్యం విషయంలో ప్రభుత్వం తీరు చూస్తుంటే మద్యం నియంత్రిస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పిస్తోందని చెప్పారు.మద్యం దుకాణాల తగ్గించామని చెబుతూనే మరోవైపు మద్యం ధరలు భారీగా పెంచి మద్యంపై ఆదాయానికి ద్వారాలు తెరిచిందని ఆరోపించారు.నిరుద్యోగులకు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలిచ్చి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం బాధాకరమని వారికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది మద్యం షాపుల్లో కాదు, వివిధ కంపెనీలలో అని పేర్కొన్నారు.మద్యం దుకాణాల్లో పనిచేసేవాళ్లు బయట మద్యం అమ్మకాలు చేస్తున్నారని.. బెల్ట్ షాపులకు మద్యం వెళుతోందని, మాదక ద్రవ్యాల వినియోగం ఏపీలో బాగా పెరిగి పోయిందని ఆరోపించారు.ఈ క్రమంలో గతంలో లిక్కర్ బ్రాండ్స్ చాలా ఉండేవని ఇప్పుడు మద్యం బ్రాండ్లు బాగా తగ్గిపోయాయని వ్యాఖ్యానించడంతో సభాపతి సీతారాంతో సహా సభ్యులంతా నవ్వుకున్నారు.ఆ బ్రాండ్‌ల గురించి నీకెందుకు తల్లి వేరే వాళ్లు మాట్లాడతారు అంటూ స్పీకర్ నవ్వుతూ ఎమ్మెల్యే భవాని కి సలహా ఇచ్చారు..