మోదీని సాగనంపుదాం..విపక్షాల సమర భేరి

మోదీని సాగనంపుదాం..విపక్షాల సమర భేరి

కోల్‌కతా: పశ్చిమ్‌ బంగలోని కోల్‌కతా వేదికగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు సమరశంఖం పూరించాయి. ఒకే వేదికపై చేరి ప్రతిపక్షాల ఐక్యతను చాటాయి. బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భాజపాయేతర పార్టీల నేతలు ఐక్య ర్యాలీకి తరలివచ్చారు. ఒక్కొక్కరిగా ప్రసంగిస్తూ భాజపా ప్రభుత్వ పాలనపై విమర్శల వర్షం కురిపించారు.

దొంగలకు వ్యతిరేకంగా మా పోరాటం: హార్దిక్‌

‘నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌.. గోరో (బ్రిటీషర్లు)కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. మేమంతా దొంగలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం’ అని గుజరాత్‌ పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌ అన్నారు. అనంతరం దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ ప్రసంగించారు. ‘దేశం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. నాలుగున్నరేళ్ల భాజపా పాలనలో పేదలు, మైనార్టీలు, దళితులు దోపిడీకి గురవుతున్నారు’ అని విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మహాకూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భాజపా వ్యూహం అదే: యశ్వంత్‌ సిన్హా

ప్రజాస్వామ్య పరిరక్షణకు విపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని దుయ్యబట్టారు. దేశాన్ని చిన్నాభిన్నం చేసి పాలించాలనేది భాజపా వ్యూహంగా కనిపిస్తోందని యశ్వంత్‌ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో అల్లర్లు, కాల్పులకు కారణమెవరని ఆయన ప్రశ్నించారు. మరో కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి మాట్లాడుతూ.. భాజపా ఒంటెద్దు పోకడలకు పెద్దనోట్ల రద్దే నిదర్శనమన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్థిరం చేసేందుకు భాజపా యత్నిస్తోందని మండిపడ్డారు.

భాజపాది నియంత వైఖరి: కుమారస్వామి

‘‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా భాజపా పాలన సాగుతోంది. ప్రజలంటే గౌరవం లేని, ప్రజల ప్రయోజనాలు పట్టని ప్రభుత్వం కేంద్రంలో ఉంది. భాజపాది నియంత వైఖరి. ఆ పార్టీ కుట్రలతో పేద రైతులు ఎంతగానో నష్టపోతున్నారు. కర్ణాటకలో రైతు రుణమాఫీని విఫలం చేయాలని భాజపా కుట్ర చేసింది. ఆ పార్టీ కార్పొరేట్లను ఒకలాగ, రైతులను ఒకలాగా చూస్తోంది’ అని కుమారస్వామి దుయ్యబట్టారు. భాజపా రైతులు, పేద ప్రజల కోసం ఎలాంటి పథకాలు తీసుకురావట్లేదని, అంతేగాక.. ఈ పార్టీ విధానాలతో గ్రామీణ ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు.

ఈవీఎంలు చోర్‌ మెషిన్లు: ఫరూక్‌ అబ్దుల్లా

ఈవీఎంలు చోర్‌ మెషిన్లు.. ఎన్నికలు సజావుగా జరగాలంటే తిరిగి పేపర్‌ బ్యాలెట్ల విధానం రావాల్సిన అవసరం ఉందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. భాజపా ప్రభుత్వం ప్రజలను కుల, మతం పేరిట విభజించి పాలిస్తోందని ఫరూక్‌ ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో ఏర్పడ్డ పరిస్థితికి భాజపానే బాధ్యత వహించాలని, నేను ముస్లింని.. కశ్మీరీని అయినా ఈ దేశంలో భాగమని అన్నారు. అంతా కలిసి పోరాడి భాజపాను ఓడించాలని అన్నారు.

భాజపా ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తోంది: శరద్‌ యాదవ్‌

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలను నాశనం చేసిందని, ఒక్క దాన్ని కూడా వదలలేదని ర్యాలీలో పాల్గొన్న లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్‌ శరద్‌ యాదవ్‌ ఆరోపించారు. దేశం ప్రమాదంలో ఉందని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ప్రతి చోటా నాశనమే కనిపిస్తోందన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు దేశ పరిస్థితిని దిగజార్చాయని అన్నారు.

మోదీని గద్దె దించి.. దేశాన్ని కాపాడండి: స్టాలిన్‌

‘మతవాద పోకడల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు సాగుతున్న పోరాటమిది. భాజపాను ఓడించండి.. మోదీని గద్దె దించండి.. దేశాన్ని కాపాడండి.. ఇదే మన నినాదం. మహాకూటమి చేతిలో ఎక్కడ ఓడిపోతామోనని భాజపా భయపడుతోంది. అందుకే ప్రతిసారి విపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. మోదీకి వ్యతిరేకంగా ఎందుకు ముందుకెళ్తున్నారని చాలా మంది నన్ను ప్రశ్నించారు. మోదీ విధ్వంసకర విధానాలకు మాత్రమే నేను వ్యతిరేకం. అంతేకానీ వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకం లేదు’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos