దర్శకుడు శంకర్, నటుడు కమల్‌హాసన్ కాంబినేషన్‌లో 22 ఏళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ చిత్రానికి ఇప్పుడు ‘భారతీయుడు 2’ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది. లైకా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ‘భారతీయుడు’లో ‘ఇండియన్ తాత’గా మెప్పించిన కమల్‌హాసన్ మళ్లీ అదే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మేకప్ కోసం హాలీవుడ్ నుంచి ప్రత్యేక నిపుణుల్ని తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎ.ఎమ్.రత్నం, కాజల్, సుభాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ ఈ సినిమాను వీలైనంత త్వరలోనే విడుదల చేయనున్నారని సమాచారం. ఇందులో కమల్‌హాసన్ మనవడి పాత్రలో శింబు నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.