తన భద్రత చూసుకొనే సీక్రెట్ సర్వీసెస్ సిబ్బందికి అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్ పిజ్జాలను అందజేశారు. అమెరికా పాక్షిక షట్‌డౌన్ కారణంగా గత 29రోజులుగా ఫెడరల్ ఉద్యోగులు జీతాల్లేకుండా పనిచేస్తున్నారు. చాలా రోజులుగా వేతనాలు లేకపోవడం వల్ల వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన బుష్ సీక్రెట్ సర్వీసెస్‌కు చెందిన అధికారులకు పిజ్జాలు తీసుకెళ్లి ఇచ్చారు. దానికి సంబంధించిన ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఒక నిర్ణయానికి వచ్చి షట్‌డౌన్ ఎత్తేయాలని బుష్ పిలుపునిచ్చారు. తమ రక్షణ కోసం పనిచేస్తున్న సీక్రెట్ సర్వీసు ఉద్యోగులతో పాటు, వేతనాలు లేకుండా పనిచేస్తున్న వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు తాను, తన భార్య లారా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. మెక్సికోతో సరిహద్దులో గోడ నిర్మించేందుకు నిధులు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబట్టగా.. అందుకు డెమోక్రాట్లు అంగీకరించడం లేదు. నిధులు కేటాయిస్తేనే తాను ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తానని ట్రంప్ పట్టుబట్టడంతో ప్రభుత్వ చెల్లింపులకు డబ్బు లేక తాత్కాలికంగా అమెరికా షట్‌డౌన్ మొదలైంది. అమెరికా చరిత్రలోనే ఇది సుదీర్ఘ షట్‌డౌన్.