అసలే శాసనసభ ఎన్నికల ఫలితాలతో ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెలంగాణలో కీలక స్థానాల్లో పోటీచేసిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం హస్తం నేతల్ని కలవరానికి గురిచేస్తోంది. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ ఆర్మూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరారు. గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీచేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి తాజాగా తెరాసలో చేరారు. వంటేరు కాంగ్రెస్‌ను వీడటం పార్టీ వర్గాలపై ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. ఓ వైపు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారంతోపాటు తాజా పరిణామాలు కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో నేతలు పార్టీని వదిలి వెళ్లకుండా నిలువరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అర్థంకాక ముఖ్య నేతలు సతమతమవుతున్నారు. శాసనసభ నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరించిన పలువురు పార్టీకి దూరం అవుతుండటం లోక్‌సభ ఎన్నికల్లో నష్టం కలిగిస్తుందని పేర్కొంటున్నారు. పార్టీని వీడుతున్నవారికి ఎలాంటి బలమైన హామీ ఇవ్వలేని పరిస్థితులు ఉండటంతోనే నిలువరించలేకపోతున్నామని వాపోతున్నారు. కాంగ్రెస్‌లోనే ఉండాలని చెబుతున్నామని.. అంతకుమించి ఏమీ చేయలేకపోతున్నామని ముఖ్యనేత ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.