ఎంతసేపు అని ఇలా రిసార్టుల్లోనూ… హోటళ్లలోనూ క్యాంపులు పెట్టుకుని ఎమ్మెల్యేలను కాపాడుకుంటారు? అనేదే పెద్ద ప్రశ్న. ఏదో బల నిరూపణ సమయంలో అయితే కొన్నిరోజుల పాటు కాపాడుకోవచ్చు. అయితే ఇలా రోజులకు రోజులు.. వారాలకు వారాలు.. క్యాంపులు నిర్వహించాలి, అసంతృప్త ఎమ్మెల్యేలను సంతృప్త పరచాలి అంటే.. ఎవరికీ సాధ్యంకాకపోవచ్చు.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎంతసేపని ఎమ్మెల్యేలను గుప్పిట్లో బంధించి ఉంచుకోగలదు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇండిపెండెంట్లు జారిపోయారు. తాజాగా సీఎల్పీ మీటింగుకు ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు.వారు తమకు చెప్పే ఆబ్సెంట్ అయ్యారని సిద్ధరామయ్య అంటున్నాడు. అయితే వారు నలుగురూ ఇప్పటికే తిరుగుబాటు మాటలు మాట్లాడినవారు కావడంతో.. కాంగ్రెస్ బలంలో నలుగురు ఎమ్మెల్యేలు తగ్గిపోయినట్టే అనే టాక్ వినిపిస్తోంది. ఇక తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరలు వేస్తోందని.. వాళ్లను కోట్ల రూపాయలతో కొనడానికి ప్రయత్నిస్తోందని కూడా సిద్ధరామయ్య అంటున్నాడు. అయితే.. ఈ విషయంలో కాంగ్రెస్ ఏమీ తక్కువ కాదనే వార్తలు వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ కూడా బాగానే విదిలిస్తోందని.. ఎమ్మెల్యేలు కోరినవి ఇస్తోందని వార్తలు వస్తున్నాయి.కాంగ్రెస్ బలహీనతను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు రకరకాల డిమాండ్లు చేస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యేలను ఇలా సంతృప్తి పరచడం అంటే.. అది బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా అక్రమ డబ్బుతోనే కదా. కర్ణాటక రచ్చకు శుభంకార్డు పడిందని అంతా అనుకున్నారు.కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వ మనుగడకు ప్రస్తుతానికి ఇబ్బంది లేనట్టే అనుకున్నారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు చేజారడంతో… కథ మళ్లీ ఆసక్తిదాయకంగా మారింది.