చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి సమీపంలోని వేడంలో కొలువైన కాలభైరవ ఆలయంలో కొంతమంది తమిళులు క్షుద్రపూజలను నిర్వహించడం కలకలం రేపింది. ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు అనుమానిస్తున్నారు. క్షుద్రపూజల సంగతిని తెలుసుకున్న పోలీసులు ఐదుగురు తమిళనాడు వాసులను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంలో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తన బంధువుల కోసం ధన్‌పాల్ ఆలయంలో హోమాలు,పూజలు నిర్వహించారనే ఆరోపణలు వినపడుతున్నాయి.ఏఈవో ఆదేశాలపై ఐదు మంది భైరవస్వామి ఆలయానికి వచ్చి వింత పూజలు జరిపినట్లు సమాచారం.స్వామి దర్శనానికి వచ్చిన భక్తులను లోపలికి రానీయకుండా,.. బయటనే ఉంచి తాళాలు వేసిమరీ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సాధారణంగా అమావాస్య వేళల్లో భైరవస్వామిని దర్శించుకోవడానిక భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. వారిని స్వామివారిని దర్శించుకోనివ్వకుండా ఇలా చేయడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.