ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనిస్తున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి మరో ముందడుగు వేసింది. కూటమి తరఫున నాయకుడుగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా అనంతరం ముంబైలోని ఓ హోటల్లో సమావేశమైన మూడు పార్టీల శాసన సభ్యులు ఉద్ధవ్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 1న ముంబైలోని శివాజీ పార్కులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ కూడా ప్రమాణం చేయనున్నారు. ఠాక్రేకు మద్దతుగా ఎమ్మెల్యేలంతా సంతకాలు పెట్టిన లేఖను గవర్నర్‌ను కలిసి అందజేయనున్నారు. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు బుధవారమే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల ప్రమాణంతో సభ ముగియనుంది. కాగా అసెంబ్లీలో సరిపడా బలం లేనందున సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.